Uncategorized

‘జైల‌ర్ 2’ రివ్యూ: ఫ‌స్టాఫ్ పైసా వ‌సూల్.. మ‌రి సెకండాఫ్‌..?!

సూప‌ర్ స్టార్ల‌తో సినిమా అంటేనే.. చాలా ప‌రిధులు, ప‌రిమితులు ఉంటాయి. వాళ్ల‌తో ఏం చేయాలో తెలిస్తే స‌రిపోదు. ఏం చేయ‌కూడ‌దో కూడా అవ‌గాహ‌న ఉండాలి. మ‌రీ ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్ తో. ఈ వ‌య‌సులో వాళ్ల‌తో డాన్సులు, టీజింగు సీన్లు, రొడ్డ కొట్టుడు ఫైట్లు చేయిస్తే జ‌నం చూడ్డానికి సిద్ధంగా లేరు. ఎంత వీర ఫ్యాన్ అయినా స‌రే.. వాళ్ల‌ని రొటీన్ వ్య‌వ‌హారాల‌తో మెప్పించ‌డం క‌ష్టం. ఏదో ఓ స‌ర్ఫ్రైజ్ ఇవ్వాల్సిందే. నెల్స‌న్ అదే చేశాడు. జైల‌ర్ తో.. ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ ని త‌న వైపు తిప్పుకొన్నాడు. వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లో ఓ స్టార్ ని చూపించి, ర‌జ‌నీకాంత్ తో ఇలాంటి సినిమాలు కూడా చేయొచ్చు.. అని నిరూపించాడు. చాలా విష‌యాల్లో ‘జైల‌ర్’.. మిగిలిన ద‌ర్శ‌కుల‌కు కొత్త పాఠాలు నేర్పించింది. ఇప్పుడు ‘జైల‌ర్ 2’ వంతొచ్చింది. నిజానికి సీక్వెల్ సినిమాల‌తో హిట్టుకొట్ట‌డం చాలా అరుదైన సంగ‌తి. త‌మిళ‌నాట అస‌లు ఈ ఫార్ములానే ప‌నికి రాలేదు. అయినా స‌రే – జైల‌ర్ ఇచ్చిన న‌మ్మ‌కంతో టీమ్ మ‌ళ్లీ బ‌రిలో దిగింది. ఈసారి కూడా ఆ మ్యాజిక్ జ‌రిగిందా, లేదంటే త‌మిళ నాట సీక్వెల్స్ అచ్చురావు అనే సెంటిమెంట్ మ‌రోసారి నిరూపిత‌మైందా?

టైగ‌ర్ ముత్తు వేల్ పాండ్య‌న్‌ (ర‌జ‌నీకాంత్‌) గ‌తాన్ని దాచుకొని, ఓ సూప‌ర్ మార్కెట్ లో సూప‌ర్ వైజ‌ర్‌గా ప‌ని చేస్తుంటాడు. అయితే విగ్ర‌హాల అక్ర‌మ ర‌వాణా వెనుక ఎవ‌రున్నారో తెలుసుకోవాల‌న్న మిష‌న్ మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది. అందుకే.. మూర్తి అనే లోక‌ల్ రౌడీ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్ గా చేర‌తాడు. అక్క‌డ్నుంచి మెల్ల‌మెల్ల‌గా తీగ లాగుతాడు. ఈ అక్ర‌మ ర‌వాణా మూలాలు గోవాలో ఉన్న‌ట్టు అర్థం అవుతుంది. బోధి క‌ల్స‌క్ (సూర్య‌) ఈ గ్యాంగ్ కి లీడ‌ర్‌. అక్క‌డి వ‌ర‌కూ వెళ్ల‌డానికి ముత్తు ఎలాంటి స్కెచ్ వేశాడు? కాంతా (విద్యాబాల‌న్‌) ఎవ‌రు? వ‌ర్మ (వినాయ‌క‌న్‌)ని చంపినందుకు ముత్తుపై ప‌గ తీర్చుకోవ‌డానికి ఎవ‌రు బ‌రిలోకి దిగారు? వాళ్ల‌తో ముత్తు ఆడుకొన్న ఆటేమిటి? ఇదీ.. జైల‌ర్ 2 నేప‌థ్యం.

‘జైల‌ర్ 2’ క‌థ కోసం నెల్స‌న్ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. అందుకు పునాది జైల‌ర్ 1లోనే వేసుకొన్నాడు. విగ్ర‌హాల అక్ర‌మ ర‌వాణా కేసులో ముత్తు త‌న ఇన్వెస్టిగేష‌న్ కొన‌సాగించ‌డ‌మే క‌థ‌. అయితే ఈ ప్ర‌యాణంలో బోధి క‌ల్స‌క్ (ఎస్‌.జె.సూర్య) అనే కొత్త పాత్ర వ‌స్తుంది. పార్ట్ 1లో మోహ‌న్ లాల్‌, శివ‌న్న‌, జాకీషాఫ్ర్ లాంటి గెస్ట్ రోల్స్ చూశాం. వాళ్ల‌కు ఈసారి హృతిక్ రోష‌న్ తోడ‌య్యాడు. తొలి 20 నిమిషాలూ సెట‌ప్ కోసం వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. సీక్వెల్స్ విష‌యంలో అంత టైమ్ తీసుకోవ‌డం అవ‌స‌రం కూడా. మూర్తి అనే ఓ క్యారెక్ట‌ర్ ని బాగా వాడుకొన్నాడు నెల్స‌న్‌. ఈ పాత్ర అమాయ‌క‌త్వంలోంచి పుట్టుకొచ్చే వినోదం హిలేరియ‌స్ గా పండింది. నెల్స‌న్ బ‌లం ఏమిటంటే.. త‌న కామెడీ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. సందర్భోచితంగా న‌వ్విస్తాడు. ఈసారీ అది వ‌ర్క‌వుట్ అయ్యింది. యోగిబాబుని ఇంత సెటిల్డ్ గా వాడుకొన్న ద‌ర్శ‌కుడు కూడా నెల్స‌నే అనుకొంటా. మూర్తి, విమ‌ల్ (యోగిబాబు) పాత్ర‌ల నుంచి వ‌చ్చే ఫ‌న్ ఫ‌స్టాఫ్ ని న‌డిపించేసింది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ర‌జ‌నీకాంత్ ఎలివేష‌న్లు మామూలే. పూర్ణ‌తో చేయించిన ఐటెమ్ గీతం మ‌రో ఆక‌ర్ష‌ణ‌. పాట పెద్ద‌గా ఎక్క‌దు కానీ, కొరియోగ్రఫీ మాత్రం బాగుంది. జైల‌ర్ 1 పేట్ర‌న్‌లోనే సీన్లు, ఎలివేష‌న్లు సాగిపోతాయి. అయినా బోర్ కొట్ట‌లేదు. విశ్రాంతి కార్డు ప‌డేస‌రికి.. పైసా వ‌సూల్ అయిపోయింద‌న్న ఫీలింగ్ వ‌చ్చేస్తుంది.

ఈ సినిమా స‌మ‌స్యంతా సెకండాఫ్‌లో ఉంది. సూర్య పాత్ర ఎంట‌ర్ అయ్యాక‌.. జోష్ మ‌రింత పెర‌గాలి. కానీ.. అది జ‌ర‌గ‌లేదు. సెకండాఫ్‌లో కొత్త పాత్ర‌లు చాలానే ఎంట్రీ ఇస్తాయి. విద్యాబాల‌న్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్లు ద్వితీయార్థంలోనే రివీల్ అవుతాయి. ఇంత స్టార్ కాస్ట్ పెట్టుకొని కూడా నెల్స‌న్ సాదా సీదా సీన్లు తీయ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే.. అంత సీరియ‌స్ సెట్యువేష‌న్‌లో కూడా విద్యాబాల‌న్ ని ర‌జ‌నీకాంత్ టీజ్ చేయ‌డం బాగుంటుంది. ర‌జ‌నీ ఫ్యాన్స్ కి ఆ సీన్లు బాగా న‌చ్చుతాయి. సెకండాఫ్ లో రెండు కిడ్నాప్ ఎపిసోడ్లు ఉంటాయి. హీరో త‌న వాళ్ల‌ని కాపాడుకోవ‌డ‌మే మిష‌న్‌. ఆ సీన్లు మ‌రీ చ‌ప్ప‌గా సాగాయి. మోహ‌న్ లాల్, శివ రాజ్ కుమార్ పాత్ర‌ల్నీ స‌రిగా వాడుకోలేదు. చివ‌ర్లో హృతిక్ రోష‌న్ వ‌చ్చి కాస్త ఊపు తెచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఆ మ్యాజిక్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. క్లైమాక్స్ మ‌రీ వీక్ గా ఉంది. విల‌న్ క్యారెక్ట‌ర్‌.. హీరోని సెంటిమెంట్ గా దెబ్బ తీయాల‌నుకోవడం ఆ పాత్ర‌ని ఇంకా ఇంకా బ‌ల‌హీన‌ప‌రిచింది. చివ‌ర్లో.. పార్ట్ 3 కి లీడ్ ఇచ్చారు. ఆ సీన్లూ పెద్ద‌గా ఇంప్రెస్ చేయ‌లేక‌పోయాయి. సెకండాఫ్ లో ఇంత జ‌రిగినా.. ఈ సినిమాపై మ‌రీ బ్యాడ్ ఒపీనియ‌న్ రాదు. దానికి కార‌ణం.. ఫ‌స్టాఫ్ ఇచ్చిన కిక్కే. పార్ట్ 2పై జ‌నాల‌కు పెద్ద‌గా న‌మ్మ‌కాలు లేక‌పోవ‌డం, జైల‌ర్ 2పై స‌రైన బ‌జ్ క్రియేట్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. ఈ సినిమాపై అంచ‌నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవి జైల‌ర్ కు క‌లిసొచ్చే విష‌య‌మే. అంచ‌నాలు త‌గ్గ‌డం వ‌ల్ల‌.. యావ‌రేజ్ కంటెంట్ ఇచ్చినా న‌చ్చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అది ఈ సినిమాకు ప్ల‌స్‌.

అన్నింటికంటే బాగా న‌చ్చిన విష‌యం ఏమిటంటే.. ర‌జ‌నీకాంత్ ని నెల్స‌న్ వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లో చూపించాడు. స్టార్ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాడు. ర‌జ‌నీ క్రాఫ్ క‌ద‌ల‌కుండా, ష‌ర్ట్ న‌ల‌గ‌కుండా, క‌త్తి ప‌ట్ట‌కుండా, బుట్లెట్ పేల్చ‌కుండా కూడా… ఫ్యాన్స్ కి పూన‌కాలు తీసుకురావొచ్చు అనే విష‌యాన్ని మ‌రోసారి రూఢీ చేయించాడు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌నుకొనే ద‌ర్శ‌కుల‌కు ఇదో గైడ్ అనుకోవాలి.

ర‌జ‌నీకాంత్ మానియా ఈ సినిమాలో పూర్తిగా క‌నిపించింది. చాలా సింపుల్ గా.. స్టైలీష్ గా క‌నిపించాడు. వ‌య‌సు దాచుకోవ‌డానికి ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ పాత్ర మ‌రింత క‌నెక్ట్ అయ్యింది. ఎస్‌.జె.సూర్య‌ని తీసుకురావ‌డం మంచి ప‌నే. త‌న ఎంట్రీ కూడా బాగుంటుంది. కానీ రాను రాను సూర్య‌.. త‌న రొటీన్ డైలాగ్ డెలివ‌రీతో కాస్త విసుగెత్తించాడు. విద్యాబాల‌న్ కాఫీ సీన్ బాగుంది. సూప‌ర్ స్టార్‌.. విద్యాబాల‌న్ ని టీజ్ చేయ‌డం ఇంకా బాగుంది. పార్ట్ 3 లో ఈ పాత్ర‌ని ఇంకా బాగా వాడ‌తాడేమో చూడాలి. మిథున్ ని స‌రితూగే పాత్ర కాదిది. జాకీష్రాఫ్ ని పార్ట్ 2 లో అస్స‌లు వాడుకోలేదు. విజ‌య్ సేతుప‌తి చివ‌రి షాట్ లో క‌నిపిస్తాడంతే. త‌న విన్యాసాలూ త‌దుప‌రి భాగంలోనే చూడాలేమో..?

టెక్నిక‌ల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా అనిరుథ్ త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ‌ళ్లీ మ్యాజిక్ చేశాడు. పాత బీజియం వాడుకొన్నా.. కావ‌ల్సిన చోట వినిపించాడు. పాట‌లు మైనస్‌. మోనికా బెలోచీ (కూలీ) లాంటి పాట ఒక్కటి ఉన్నా బాగుండేది. ఫైట్స్ లో హింస‌, ర‌క్త‌పాతం త‌గ్గించారు. స్టైలీష్ మేకింగ్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. ద‌ర్శ‌కుడిగా నెల్స‌న్ పూర్తి మార్కులు తెచ్చుకొన్నాడు. అయితే రచ‌యిత‌గా సెకండాఫ్ లో ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ పై కొంత వ‌ర్క్ చేసి ఉంటే బాగుండేది. రొటీన్ క్లైమాక్స్‌, కిడ్నాప్ డ్రామాల జోలికి వెళ్ల‌కుండా ఉంటే.. జైల‌ర్ 2 ర‌జ‌నీకాంత్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ అయ్యేది. ఇప్ప‌టికీ మించి పోయిందేం లేదు. టికెట్ రేటు గిట్టుబాటు అయ్యే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాతో ఇచ్చేశాడు. ర‌జ‌నీ ఎలివేష‌న్లు, అనిరుథ్ బీజియం, ఫ‌స్టాఫ్ లో సెటిల్డ్ కామెడీ కోస‌మైనా ఈ సినిమా నిర‌భ్యంత‌రంగా చూసేయొచ్చు

Shares:

Related Posts

Nothing Found! Ready to publish your first post? Get started here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *