movies

‘క్రేజీ క‌ల్యాణం’ రివ్యూ: ఆడ‌పిల్ల పెళ్లి కోసం తండ్రి ఆరాటం

ఇంట్లో మ‌గ పిల్లాడు పుడితే.. చ‌దువు కోసం ఆలోచిస్తాడు తండ్రి. అదే కూతురైతే పెళ్లి బెంగ‌. వ‌య‌సొచ్చిన ఆడ‌పిల్ల‌ని ఏదో ఒక రోజు అయ్య చేతిలో పెట్టాల్సిందే. గొప్పింటి అల్లుడొస్తే – త‌న‌కు గౌర‌వం. ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలేంటి, త‌న కల‌లూ, కోరిక‌లూ ఏమిటి? అనేవేం ప‌ట్ట‌వు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి.. ఏఐ యుగం వ‌ర‌కూ స‌గ‌టు తండ్రి ఇలానే ఆలోచిస్తాడు. అందులోంచి త‌ల్లిదండ్రులు బ‌య‌టకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ‘క్రేజీ క‌ల్యాణం’ కాన్సెప్ట్ అచ్చంగా ఇదే. పేప‌ర్ పై ఈ పాయింట్ చాలా గొప్ప‌గా అనిపించి ఉండొచ్చు. అదే పాయింట్ స్క్రీన్‌పైకి వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉంది? ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న విష‌యం చెప్పాడా? ఈ క‌థ‌కు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, న‌రేష్‌, త‌రుణ్ భాస్క‌ర్ ఎంత వ‌ర‌కూ హెల్ప్ అయ్యారు?

ప‌ర్వ‌తాలు (న‌రేష్‌)కు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. పెద్ద‌కూతురికి తాగుబోతు అల్లుడు (త‌రుణ్ భాస్క‌ర్‌) వ‌స్తాడు. త‌న వ‌ల్ల అన్నీ స‌మ‌స్య‌లే. ఉద్యోగం స‌ద్యోగం ఉండ‌దు. త‌ప్ప తాగి… మావ ప‌రువు తీస్తుంటాడు. క‌నీసం త‌న చిన్న‌ల్లుడైనా అలా కాకూడ‌ద‌న్న‌ది తండ్రిగా త‌న కోరిక‌. అందుకే ఎలాంటి దుర‌వాట్లూ లేని, ఓ గొప్పింటి సంబంధం తీసుకు రావాల‌నుకొంటాడు. చిన్న‌మ్మాయి కీర్తి (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) క‌ల వేరు. బాగా చ‌దివి మంచి ఉద్యోగం సంపాదించాల‌నుకొంటుంది. త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాల‌నుకొంటుంది. చిన్న‌ప్ప‌టి నుంచీ.. త‌న వెంట ప‌డుతున్న ఉద‌య్ (అఖిల్ రాజ్‌)ని ఇష్ట‌ప‌డుతుంది. ఉద‌య్ కి కీర్తి అంటే ప్రాణం. అయితే ఉద‌య్ కి ఉద్యోగం లేదు. డ‌బ్బున్న కుటుంబ‌మూ కాదు. ఈ పెళ్లికి త‌న తండ్రి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోడ‌ని కీర్తికి తెలుసు. అదే స‌మ‌యంలో ప‌ర్వ‌తాలు.. త‌న చిన్న కూతురికి ఓ గొప్పింటి సంబంధం ఖాయం చేస్తాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కీర్తి ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంది, ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాలేంటి అనేదే మిగిలిన క‌థ‌.

ఓ ఆడ‌పిల్ల పెళ్లి కోసం తండ్రి ప‌డే ఆరాటం ఈ క‌థ‌. బ‌హుశా తండ్రులంతా ఇలానే ఆలోచిస్తారేమో. సో.. ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే పాయింటే ఇది. పైగా ఆడ‌పిల్ల‌లు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బడాల‌ని. అందుకు త‌ల్లిదండ్రులు వెన్నుద‌న్నుగా నిల‌వాల‌ని, ఆడ‌పిల్ల‌కు గొప్పింటి సంబంధం తెచ్చినంత మాత్రాన ప‌రువు నిల‌బ‌డ‌ద‌ని, త‌న ప‌రువు త‌న ఇంట్లోనే ఉంటుంద‌న్న మంచి పాయింట్ ఈ క‌థ‌లో ఉంది. ఎలా చూసినా ఆడియ‌న్స్ ని ఎంగేజ్ చేయొచ్చు. దానికి తోడు అనుప‌మ‌, న‌రేష్‌, త‌రుణ్ భాస్క‌ర్ లాంటి మంచి కాస్టింగ్ దొరికింది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, తెలంగాణ నేప‌థ్యం వీటి చుట్టూ క‌థ‌ని ఆసక్తిగా న‌డ‌పొచ్చు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇదే అనుకొని బ‌రిలోకి దిగి ఉంటారు.

కాక‌పోతే.. ఆలోచన బాగున్నంత మాత్రాన సినిమా అయిపోదు. కెమెరా ముందు న‌టీన‌టులు వ‌చ్చినంత మాత్ర‌న ఎమోష‌న్ పుట్టేయ‌దు. రైటింగ్ బ‌లంగా ఉండాలి. ప్ర‌తీ సీన్ లోనూ ఏదో ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. క్రేజీ క‌ల్యాణం నుంచి ప్రేక్ష‌కులు ఇదే కోరుకొంటారు. కానీ అదే క‌రువైంది. తొలి 30 నిమిషాలూ చాలా భారంగా గ‌డుస్తాయి. తెర‌పై అన్ని పాత్ర‌లూ ప్ర‌వేశ పెట్టి, వాళ్ల‌ని ప‌రిచ‌యం చేసి, వాళ్ల ఉద్దేశ్యాలు స్ప‌ష్టం చేసేస‌రికి.. అర‌గంట సినిమా అయిపోతుంది. కీర్తి – ఉద‌య్ ల ల‌వ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించ‌దు. ప‌ర్వ‌తాలు త‌న అన్న‌య్య కూతురికి వ‌చ్చిన సంబంధం దారి మ‌ళ్లించి త‌న ఇంటికి తీసుకురావ‌డం ద‌గ్గ‌ర నుంచి.. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డి నుంచి క‌థ అస్స‌లు ఆగ‌కూడ‌దు. కానీ… ఆ ఊపు త‌దుప‌రి స‌న్నివేశాల్లో క‌నిపించ‌దు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో ఊపూ, ఉత్సాహం కొర‌వ‌డ‌తాయి. త‌ర‌వాత ఏం జ‌రుగుతుంది, కీర్తి ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటుంది అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం రాదు. మ‌ధ్య‌లో త‌రుణ్ భాస్క‌ర్ నుంచి కొంత వినోదం పుట్టించే ప్ర‌య‌త్నం చేశారు. లేదంటే మ‌రింత బోర్ కొట్టేది.

సెకండాఫ్ లో హీరోయిన్ ఇంగ్లీష్ క్లాసులు తీసుకోవ‌డం అనే ట్రాక్ ఏదైతే ఉందో.. అది కేవ‌లం కాల‌యాప‌న‌కు త‌ప్ప దేనికీ ప‌ని చేయ‌దు. ఊర్లో వ్య‌వహారాలు, తల్లి ట్రాక్.. ఇవి కూడా పెద్ద‌గా ఎక్క‌వు. అయితే చివ‌రి 30 నిమిషాలు మాత్రం ద‌ర్శ‌కుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా న‌రేష్ పాత్ర చుట్టూ అల్లుకొన్న స‌న్నివేశాలు ఓ ఇంటెన్స్ ని తీసుకొచ్చాయి. సుదీర్ఘ‌మైన షాట్ లో న‌రేష్.. త‌న‌లోని న‌వ‌ర‌సాల్నీ చూపించేశారు. బ‌హుశా ఈ సీన్ ని చిత్ర‌బృందం చాలా గ‌ట్టిగా న‌మ్మి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీమ్ దాన్ని బాగా హ్యాండిల్ చేసింది. చివ‌ర్లో.. ఆడ‌పిల్ల చ‌దువు కోవడం, ఉద్యోగం చేయ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఓ తండ్రి న‌మ్మ‌డం ద‌గ్గ‌ర క‌థ పూర్త‌వుతుంది. అక్క‌డితో దర్శ‌కుడు త‌న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగాడు. అయితే ఈ త‌తంగంలో అల్లుడి పాత్ర‌ని ఎలివేట్ చేయ‌డానికి అన్న‌ట్టు ఓ ఫైట్ పెట్టారు. ఆ సీన్ మాత్రం అతుకుల బొంత లానే ఉంది త‌ప్ప‌, ఆర్గానిక్ గా కుద‌ర్లేదు.

అనుప‌మ తెలంగాణ స్లాంగ్ ని బాగా ప‌ట్టుకోగ‌లిగింది. త‌న ఎఫెక్ట్ ను మెచ్చుకోవాలి. పాత్ర‌ని బాగా అర్థం చేసుకొని న‌టించింది. చిన్న చిన్న డీటైలింగ్ కూడా మిస్స‌వ్వ‌లేదు. సీనియ‌ర్ న‌రేష్‌కు ఇదో మంచి పాత్ర‌. ప‌ర్వ‌తాలు పాత్ర‌లో బాగా ఇమిడిపోయారు. ఓ ద‌శ‌లో ఈ సినిమాని తానే మోశారు కూడా. చివ‌రి 30 నిమిషాలూ న‌రేష్ మాత్ర‌మే క‌నిపిస్తారు. త‌రుణ్ భాస్క‌ర్ పాత్ర‌ని ఇంకాస్త ఎంట‌ర్‌టైనింగ్ గా మ‌ల‌చాల్సింది. త‌న నుంచి ఎంతైనా కామెడీ రాబ‌ట్టొచ్చు. కానీ.. ద‌ర్శ‌కుడు దానిపై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు. అఖిల్ రాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ల‌వ్ స్టోరీల‌కు బాగా న‌ప్పుతాడు.

చిన్న సినిమా అయినా టెక్నిక‌ల్ ప‌రంగా బాగుంది. కెమెరా వ‌ర్క్ నీట్ గా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. పాట‌లు ఎక్కువైన ఫీలింగ్ క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న పాయింట్ లో జెన్యునిటీ ఉంది. అయితే.. దాన్ని ఇలా చెప్ప‌కూడ‌దేమో. ఫ‌స్టాఫ్ బాగా ఎంట‌ర్‌టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చేయాల్సింది. ఆ స్కోప్ ఉన్నా.. చేయ‌లేక‌పోయారు. చివ‌రి 30 నిమిషాలే ఈ సినిమాకు శ్రీ‌రామ ర‌క్ష‌. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై ఓ నెగిటీవ్ ఫీలింగ్ వ‌చ్చినా, క్లైమాక్స్ చూశాక‌.. అది కాస్త త‌గ్గుతుంది. ద‌ర్శ‌కుడు మంచి పాయింటే ప‌ట్టాడు కానీ, ఇంకాస్త వ‌ర్క్ చేయాల్సింది అనిపిస్తుంది. ఓవ‌రాల్ గా చూస్తే – అనుప‌మ న‌ట‌న‌, న‌రేష్ ఏక పాత్రాభిన‌యం.. ఈ సినిమాని కొంత వ‌ర‌కూ గ‌ట్టెక్కించాయి. స్క్రిప్టు ప‌రంగా జాగ్ర‌త్త‌గా ఉంటే ఇంకాస్త బెట‌ర్ అవుట్ పుట్ వ‌చ్చేది.

Shares:

Related Posts

movies

విజ‌య్ Vs విజ‌య్ సేతుప‌తి.. బిగ్ బాస్ లో ఏం జ‌రుగుతోంది?

తమిళ బిగ్‌బాస్ షో మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి వివాదానికి కారణం హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్. బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టిన విజయ్ సేతుపతి.. హోస్టింగ్ విషయంలో తనదైన శైలిని చూపిస్తున్నారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *